తెలుగు సంస్కృతితెలుగు జాతి మనది
నిండుగ వెలుగు జాతి మనది.

మనది నిండైన తెలుగు భాష, ఆప్యాయత అనురాగాలను ఇనుమడించుకున్న భాష. తెలుగు వారి చరిత్ర, భాష సంస్కృతి సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి. వీటి గొప్పదనం తెలుసుకుని ఆచరించి, సంస్కృతీ వారసత్వన్ని కొనసాగించినపుడే తెలుగువారి గౌరవం ఇనుమడిస్తుంది. ఎందరో మహనీయులు, కవులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు. తెలుగులో ఎందరెందరో లబ్ధ ప్రతిష్ఠులైన కవులు, పండితులు, కళాకారులు ఉన్నారు. వారి గొప్పతనాన్ని తెలుసుకోవాలి. పిల్లలకి చెప్పాలి. భవిష్యత్ తరాలకు అందించడం ద్వారానే తెలుగు సంస్కృతి తరతరాలకు వెల్లివిరుస్తుంది.

ప్రప్రధమంగా నన్నయ, తిక్కన, యెఱ్ఱాప్రగడలు మహాభారతం వంటి గొప్పకావ్యాన్ని సంస్కృతం నుండి తెలుగులోకి, సామాన్య మనవుడికి అర్థమయ్యే విధంగా, చక్కగా అనువదించారు.

తెలుగు సొబగులను గుర్తించిన శ్రీకృష్ణదేవరాయలు దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు. అంతేకాదు ఆయన ఆస్థానంలో ఎనమండుగురు కవులను నియమించుకుని అష్టదిగ్గజాలతో కొలువుదీరిన భువనవిజయం తెలిసినదే. శతాబ్దాల క్రిందటే ఇలాంటి సత్సాంప్రదాయాన్ని నెలకొల్పిన ఘనత శ్రీకృష్ణదేవరాయలకే దక్కుతుంది.

రామాయణ, మహాభారతాల్లో సహితం తెలుగు ప్రాశస్త్యం ఉందని చెబుతుంటారు. త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు తెలుగువారు కావడం తెలుగు తల్లి గర్వించే విషయం. తెలుగుభాషా వైభవాన్ని తీర్చిదిద్దిన వైతాళికులు కోకొల్లలు. వారి సాహిత్యాన్ని భద్రపరుచుకుని, వారిపై పరిశోధనలు చేయవలసిన అవసరం ఉంది. స్థానిక వాతావరణాన్ని బట్టి కట్టు, బొట్టులో తెలుగు వారి ప్రత్యేకత ఉంది. తెలుగు వారి కీర్తి సరిహద్దులు దాటి విదేశాలను సహితం వ్యాపించింది. ఎందరో పాశ్చాత్యులు ఇక్కడి సంస్కృతీ సాంప్రదాయాలను ఇష్టపడి ఆచరిస్తున్నారు.

ఇప్పటి తరం వారికి తామెంతటి ఘన చరిత్ర, సమున్నత సాంప్రదాయాలకు వారసులో తెలియజెప్పి వీటి ఆచరణకు పునరంకితం అయ్యేలా చేయడంతో పాటు పదిలంగా చూసుకోవాల్సిన తరుణం నేడు ఉంది. ఈ బాధ్యత ప్రతీ తెలుగు వారిదీ.

తెలుగు సంస్కృతిలో కళలకు విశిష్ట స్థానముంది. ప్రజలు, ప్రభువులు కళాకారులను కళలనూ గుర్తించి, గౌరవించి పోషించుట చేతనే చాలాకాలం అజరామరంగా జీవించాయి. ఆంగ్లభాష ప్రబలి విద్యుతాధార వినోదం ప్రజలకు అందుబాటులోకి రావడంతో మెల్లమెల్లగా ఒక్కొక్క కళ కనుమరుగవుతూ ప్రస్తుతం అంతరించే స్థితికి చేరుకున్నాయి. తెలుగు సంస్కృతిలో ప్రధానమైన కళాంశాలు:

కోలాటం
కొమ్మునృత్యం
జముకు
బొమ్మలకొలువు
ప్రభలు
బుట్టబొమ్మలు
బుర్ర కథ
తండాలనృత్యం
యక్షగానం
తప్పెటగుళ్ళు
జంగందేవరలు
ఎడ్లపందాలు
పులివేషం
హరిదాసులు
గోరింటాకు
ముగ్గులు
గుసాడీ
థింసా
డప్పు
శరభనృత్యం
చెమ్మచెక్క
రుంజ
గంగిరెద్దులు
చెడుగుడు
జంగందేవర
చోడిగాడి కలాపం
దేవదాసినృత్యం
పకీరు వేషం
డప్పరి నృత్యం
పిట్టలదొర
బుడబుక్కలవాడు
గొంతెలమ్మ అశ్వనృత్యం
లంబాడి గన్నెగాడు
బుడిగే జంగాలు
కనక తప్పెట్లు
వాలకం నృత్యం
చెంచునృత్యం
ఘటనృత్యం
విప్రవినోధం
దేవతాకొలువులు
దండగానం
జిత్తుల గారడి
ఎరుకలసాని
కొమ్మదాసరి
ఉరుముల నృత్యం
చిందు భాగవతం
భజన
కాశీకావడి
మందులవారి వేషాలు
వీర శైవులు
గొల్ల సుద్దులు
వీరభద్ర విన్యాసం
పగటి వేషాలు
తెలుగు సంస్కృతిని రక్షించుకుందాం. తెలుగు కళలని కాపాడుకుందాం.