పాటలుపాడరా ఓ తెలుగువాడా     

రచన : కొండేపూడి లక్ష్మీనారాయణ
పల్లవి:    పాడరా ఓ తెలుగువాడా


పాడరా ఓ తెలుగువాడా! పాడరా ఓ కలిమిరేడా
పాడరా మన ఆంధ్రదేశపు భవ్య చరితల
దివ్యగీతం పాడరా

1.   యుగయుగమ్ముల నుండి బంగరు గంగ నిచ్చెడి గౌతమీనది
కోహినూరును కురుల సందున ముడిచి కులికిన కృష్ణవేణి
హోయలుగా రతనాల సీమను ఓలలాడిన తుంగభద్రా
సోగసు గూర్చెను తెలుగు తల్లికి సుఖము గూర్చెను తెలుగువారికి

2.   కదన రంగమునందు మెరిసిన కాకతీయుల ఖడ్గతేజం
వదరు శత్రువు నెదిరిపోరిన వనిత రుద్రమ యుద్ధపటిమ
కొదమ సింగము పగిరి నురిగిన బాలచంద్రుని బాహుదర్పం
పొంగ జేయద మేనిరక్తం ఉప్పొంగ జేయద నీదు హృదయం

3    తెలుగు పలుకులు తేనె లొలుకును తిక్కనార్యుని కవితలోన
రాలుకరిగే త్యాగరాయుని రాగసుధలో మునిగే తెనుగు
సొంపు గూర్చెను తెలుగు తల్లికి హంపి నగరపు శిల్పసంపద
భరత నాట్యపు భంగిమల్లో పల్లవించెను తెలుగు పరువం

4.   తెలుగు జాతికి నూత్న సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి   
తెనుగు భాషను ప్రజల భాషగ జేయగోరిన గిడుగు పిడుగ్
దేశమంటే మనుజులేనని చాటి చెప్పిన అప్పారాయుడు
తెలుగుతల్లి నోముపంటలే తేజరిల్లిన దివ్యతారలు

5.   కలవు గనులను నదుల జలములు
పసిడి పాతర మనదు దేశం
సిరియు సంపద వెల్లి విరిసే
స్వర్గ తుల్యము చేసికొందము
తొమ్మిది కోట్ల తెలుగు బిడ్డల
ఐక్య కందము లొక్క పెట్టున
జయ జయమ్మని తెలుగుతల్లికి
విజయ గీతిక లాలపించగ

 


ము౦దు పాట                              పాటల పేజి                              తరువాతి పాట