పాటలుఆ చల్లని    

రచన : దాశరధి

వ్యాఖ్యానం : తనికెళ్ళ భరణి


పల్లవి :   ఆ చల్లని సముద్రగర్భం
దాచిన బడ బానలమెంతో
ఆ నల్లని ఆకాశంలో
కానరాని భాస్కరు లెందరో

1.   భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో
ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో
కులమతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో

2.   మానవ కళ్యాణం కోసం ఫణమొడ్డిన రక్తం ఎంతో
రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసిప్రాణాలెన్నో
కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో
ఉన్మాదుల అకృత్యాలకు ధగ్ధమైన బ్రతుకులు ఎన్నో

3.   అన్నార్తులు అనాధలుండని ఆ నవయుగ మదెంత దూరమో
కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో
పసి పాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో
గాయపడిన కవిగుండెలలో వ్రాయబడిన కావ్యాలెన్నో

 


ము౦దు పాట                              పాటల పేజి                              తరువాతి పాట