తెలుగు భాషతెలుగ దేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి
దేశ భాషలందు తెలుగు లెస్స
—శ్రీ కృష్ణదేవ రాయలు

జనని సంస్కృతంబు సకల భాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?
— వినుకొండ వల్లభరాయడు

సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవ భాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయె తేట తెలుగునందు?
— మిరియాల రామకృష్ణ

సముజ్వల చరిత్ర, సంస్కృతీ ప్రాభవాలు కలిగిన తెలుగు జాతి మనది. ఘనమైన తెలుగు వైభవాన్ని చాటి చెప్పేందుకు మరియు తెలుగు సంస్కృతీ సంప్రదాయాల ప్రాభవాన్ని కొనసాగించేందుకు మనందరం కృషి చేయాలి. తల్లి వంటిది తెలుగు భాష. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది తెలుగువారున్నారు. తెలుగు భాష ఎంతో ఉత్కృష్టమైనది, ప్రాచీనమైనది. బుద్ధి వికాసం చెందడానికి, మేథోశక్తి పరిపుష్టం కావడానికి మాతృభాష ఎంతో కీలకం.

భాష యొక్క ముఖ్య అవసరం మనిషిని తోటి మనిషితో కలపటం. మనిషిని సమాజంలో ఒకడిగా చేయడం... భాష అనేది లేకపోతే ఎలా ఉంటుందో అసలు ఊహించడమే కష్టం. మనిషికి తోటిమనిషితో అనుబంధం, స్వీయ వ్యక్తీకరణ రెండు అంశాలే మనల్ని రాతియుగం నుండి ఇక్కడివరకు తీసుకువచ్చాయి. నిజానికి ఇంతటి ఉత్కృష్టమైన కార్యాన్ని నెరవేరుస్తున్న ఏ భాషైనా గొప్పదే. అందులో తెలుగుభాష మరింత గొప్పది. తెలుగుని తెలుగువారే కాదు, ఇతరులు కూడా పొగిడిన సందర్భాలు కోకొల్లలున్నాయి. తెలుగు భాషలో ఆప్యాయత, అనురాగం కలగలిపిన తీయదనం ఉంది. తేనె, చక్కెర కలగలిపిన తీపి మనకు తెలుగులో కనిపిస్తుంది. అమ్మ వద్ద నేర్చుకున్న తియ్యనైన కమ్మనైన తెలుగుభాష మాట్లాడుతున్నందుకు మనమెంతో గర్వపడాలి.

ఎంత క్లిష్టమైన విషయాన్నైనా సరళంగా విప్పి చెప్పగల్గిన పదస సంపద తెలుగుభాషకే ప్రత్యేకం. మనలో కలిగే భావాలను యథాతథంగా కాగితంపై పెట్టాలన్నా అది తెలుగు భాషలోనే వీలవుతుంది. మాతృ భాషాధ్యయనం వల్ల సృజనాత్మక శక్తి వికసిస్తుంది. సంస్కృతీ వికాసం కలుగుతుంది. తెలుగు కాపాడుకోవడంలోనే మన అభివృద్ధి ఉంది. తెలుగు భాషా సంస్కృతులకు దూరం అవడం వల్ల కలిగే దుష్ఫలితాల్ని ఇప్పటికే మనం చవిచూస్తున్నాం.

తెలుగు భాష యొక్క గొప్పతనం, తెలుగు జాతి తీయదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అని ఒక కవి చాలా గొప్పగా చెప్పారు.

మన ఇళ్ళలో తెలుగు వాతావరణాన్ని సరిదిద్దుకోవాలి. తెలుగు నేర్చుకోవాలి. తెలుగు నేర్పించాలి. తెలుగులోనే మాట్లాడుకోవాలి. వాడుకగా మాట్లాడే తెలుగులో ఉన్న అన్య భాషా పదాల వాడకం వీలైనంత తగ్గించాలి. చిన్నపిల్లలకి తెలుగు భాషపై అభిరుచి పెంపొందించేందుకు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలి.

బాల్యం నుంచే తెలుగు కథల పుస్తకాలు చదివించాలి. నీతి పద్యాలు,నేర్పించాలి. అర్ధాలు తెలియజెప్పాలి. అలా చేస్తే అవి జీవితాంతం వ్యక్తి వికాసానికి దోహదకారిగా ఉంటాయి.

తెలుగు వారందరము తెలుగులోనే మాట్లాడుదాము. తెలుగులోనే వ్రాద్దాం. తెలుగు వెలుగులను ప్రపంచ నలుదీశలా ప్రసరింపచేద్దాం.